తెలుగువారమండి.కాం
http://www.teluguvaramandi.net/
శ్రీపంచమి
- -ఎం.ఎస్.శ్యామలా శర్మ
- 28/01/2012
మాఘశుద్ధ పంచమిని ‘శ్రీపంచమి’ అంటారు. ఈ దినం మహాప్రసిద్ధమైన పర్వదినం. దేవీభాగతం, బ్రహ్మాండ పురాణం వంటి పురాణములలో ఈ తిధి మహిమ ప్రస్తావించబడినది. సకలవిద్యా స్వరూపిణి అయిన పరాశక్తి ‘సరస్వతీ దేవి’గా ఆవిర్భవించిన తిధి ‘శ్రీపంచమి’. జ్ఞానం, వాక్కు, విద్య మొదలైన శక్తులే సరస్వతి.
‘అన్న’ప్రదాయిని, బుద్ధి, శక్తుల్నిరక్షించే మాతగా సరస్వతి సాక్షాత్కరించినది. వ్యక్తమయ్యేది వాక్కు. వాక్కే సర్వమునకు కారణం.‘వాగ్భూషణమ్ భూషణమ్’- మానవునకు ‘మంచి మాటే’ అలంకారము. ఆ వాక్కుని దేవతగా ఉపాసించి, వాక్సంపదని సాధించాలి. జ్ఞానం, వాక్సంపద సరస్వతీ ఆరాధనతో సిద్ధిస్తాయి. వాక్సంపద ప్రదాయిని కనుక ఈమె ‘వాగ్దేవి’ అయినది.
శే్వత పద్మవాసిని కనుక ‘శారద’నామంతో కొలవబడుతోంది. విద్య ద్వారా సంపద సంపాదించాలన్నా, కీర్తిప్రతిష్ఠలు పొందాలన్నా, సంపాదించిన సంపదను సద్వినియోగపరచాలన్నా అవసరమైనది బుద్ధిశక్తి. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. ఈమె శివానుజగా, శివశక్తిగా భాసిల్లుతోంది. వాక్కుల శక్తి కనుక ‘‘వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, నకులీ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామములతో పిలువబడుతోంది. జ్ఞాన ప్రదాయినిగా, ధన ప్రదాయినిగా శారదాదేవిని వేదం ఉపాసించింది.
అవిద్య అనగా విద్యలేకపోవడం. విద్య అనగా జ్ఞానం. పలు విషయాల సముపార్జన శక్తే జ్ఞానం. జ్ఞానం మనలో నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. విద్యకి, జ్ఞానానికి అధిదేవత సరస్వతి. మంత్ర స్వరూపిణి అయిన సరస్వతీదేవిని ఉపాసిస్తే జ్ఞానం కలుగుతుంది. ‘అశ్వలాయనుడు’ అనే మహర్షి సరస్వతీదేవిని ఉపాసించి ఆమె కటాక్షమును పొందాడు. ఈ ఉపాసనా మార్గాన్ని ‘సరస్వతీ రహస్యోపనిషత్’ అనే గ్రంధంలో పొందుపరచాడు. సర్వమానవాళి అర్థమయ్యే రీతిలో శ్లోకరూపంలో ‘సామాంపాతు సరస్వతి’ (సరస్వతి నన్ను పాలించుగాక) అని మకుటంగా గల పది శ్లోకములు ‘దశశ్లోకి’ అను పేరుతో రచింపబడినవి.
‘దశశ్లోకి’ భక్తిశ్రద్ధలతో ఆరు నెలలు పఠిస్తే వాక్కు ప్రసన్నమయ్యి, విద్యలో విజయం చేకూరుతుంది. ఈ శ్లోకాలను మాఘశుద్ధ పంచమినాడు పఠించి ఏ విద్యను ప్రారంభించినా, ఆ విద్య దినదినాభివృద్ధి చెందుతుంది. నిత్యం ఈ శ్లోకములను ధ్యానం చేసేవారికి వాక్సుద్ధి లభిస్తుంది. వివేకం అలవడుతుంది. జగత్తు సర్వం సరస్వతీ శక్తివలనే జీవిస్తోంది. సరస్వతీ అనుగ్రహం లేనిదే మానవజీవితం వ్యర్థం. బుద్ధి, జ్ఞానశక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి ‘సరస్వతి’. ఈ మాతను విశేషంగా అర్చించి ఆమె కృపకు పాత్రులై తరించవలసిన తిధి ‘శ్రీపంచమి’. అమ్మవారు ధవళ వస్త్రాలంకృత. తెలుపు రంగు ప్రీతి. తెల్లని పుష్పములతో పూజించి, క్షీరాన్నం, చెరకు, నేతి పిండి వంటలు, నారీకేళ కదళీ ఫలములను నివేదించాలి. ఈ దినము పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే మాత కృపతో విద్యా పారంగుతులగుదురు.
ఆంధ్రప్రదేశ్ అదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరాన బాసర క్షేత్రంలో ‘శ్రీపంచమితిథి’ మహావైభవంగా జరుగుతుంది. ఈ క్షేత్రాన వెలసిన అమ్మవారు ‘వాసరా సరస్వతి’. వేదవ్యాసుడు ఈ ప్రదేశములో తపము ఆచరించి, అమ్మవారి సాక్షాత్కారమును, అనుగ్రహమును పొంది వేద విభజన, పురాణ భారత రచనాశక్తిని పొందాడు. సైకత (ఇసుక) మూర్తిని నిర్మించాక, ఈ మూర్తిలో విద్యా ప్రదాత, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీవి ప్రతిష్ఠితమయ్యింది. ఈ క్షేత్రంలో సరస్వతీ దేవి ‘స్వయంభువు’ అని వ్యాసమహర్షికి దర్శనాన్ని అనుగ్రహించిందని పురాణ వచనం. మనమూ పూజించి మాత అనుగ్రహమునకు పాత్రులగుదాము
http://www.teluguvaramandi.net/రధసప్తమిమృగశిర నక్షత్రంలో కూడిన మాసం మార్గశిర లేక మార్గశీర్ష మాసాల్లో కెల్లా మార్గశిర మాసం ప్రత్యేకత కలది. అది విష్ణు మాఘశుద్ద సప్తమినాడు వచ్చే పర్వదినం రథసప్తమి. ఇది ముఖ్యంగా సూర్యభగవానుని ఆరాధించే పండుగ. సూర్యుడు తన రధమును ఉత్తరాయణ దిక్కునకు మల్లించే రోజు ఇది. ఈ పర్వదినాన కుటుంబము వారందరూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యములు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద తల పైన పెట్టుకొని “జననీ త్వమ్హి లోకానాం సప్తమీ సప్తసప్తికే, అనే మంత్రంతో స్నానంచేయాలి. సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి. సూర్యునికి అర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలిస్తాడు. జిల్లేడు ఆకునే అర్కపత్రం అంటారు. అది సూర్యునికెంతో ఇష్టమైనది. తులసి కోటని పసుపు, కుంకుమలతో అలంకరించి, తులసి కోట ముంది ముగ్గులు వేసుకొంటారు. సూర్య బింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రంతో బొమ్మ ముగ్గుతో గీసి, ముగ్గు మీద గొబ్బి పిడకలు కుంపటిగా అమర్చి, దాని మీద గిన్నెలో అన్న పాయసం వండుకుటారు. కొత్త గిన్నెను పసుపు కుంకుమతో అలంకరించి, అందులో ఆవు పాలలో కొత్త బీయం, పటికబెల్లం పొడి ఏలకుల పొడి, నేయ్యి వేసి చక్కగా ఉడికించి, పాలు మూడుసార్లు పొంగిస్తారు. అలా పొంగిస్తే ఆ ఇంట్లో సిరిసంపదలు పొంగి పొర్లుతాయి. చీక్కుడు కాయలకు చీపురు పుల్లలు గుచ్చి చేసిన రథాన్ని ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరిచి అందులో ఉడికించిన పాయసం వడ్డించాలి. వాటిలో అగ్ని హోత్రాడికి అయిదాకులు అర్పించాలి. తులసి అమ్మవారికి అయిదు, మిగతా అయిదు సూర్య భగవానుడికి నివేదించాలి. సూర్యుడ్ని గంధ, పుష్ప, అక్షతల, షోడశోపచార అష్టోత్తర శతనామాలతోపూజించి, ఆయనకి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం దేవాలయమునకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. |